ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకనుంచి శనివారం కూడా పనిచేస్తాయి. దరఖాస్తుల వెయిటింగ్ టైం తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం కూడా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రతి శనివారం 2,200 స్లాట్ లను విడుదల చేయనున్నారు.
అవి బుధవారం ఉదయం నుంచి అందుబాటులో ఉంటాయి. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. నిన్న RBI నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సమీకరించింది. దీంతో ఏప్రిల్ నెలలో అధికారికంగా రూ.6000 కోట్ల అప్పు తెచ్చినట్లు అయింది. ఈ రూ.6000 కోట్ల అప్పుతో పాటు, కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.3,000 కోట్లు వచ్చాయి. ఇవి గాక రాష్ట్ర ఖజానాకు రోజువారి వచ్చే పన్ను ఆదాయం సగటున రోజుకు రూ. 400 కోట్ల చొప్పున వస్తుంది.