తాండూర్ ఎపిసోడ్ పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్…. సీఐకి క్షమాపణ చెప్పనున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూర్ ఘటనపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. వివాదాలతో మీడియాకు ఎక్కొద్దని వార్నింగ్ ఇచ్చింది. నిన్న తాండూర్ సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అనుచితంగా దూషించారు. చెప్పలేని విధంగా సీఐని దూషించాడు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాండూర్ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి పడటం లేదు. ఈ విషయంపై నిన్న ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు తనకు అడ్డుగా కూర్చోవడంపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఐకి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. 

కాగా… తాండూర్ సీఐని దూషించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. పొరపాటున నోరు జారానని.. మనస్సు నొప్పించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని అన్నారు. కాసేపట్లో సీఐ రాజేందర్ రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పనున్నట్లు వెల్లడించారు. పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానమని… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి,అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయం… నిన్నటి నుండి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్ లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారానని..కొంత మంది మిత్రులు, పోలీసుల భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం అని చెప్పారు.