నేడు ప్రగతి భవన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. దేశంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హయంలో ఉన్న ఎమర్జెన్సీ ముందున్న రోజులే ఇప్పుడు భారత్ లో తలెత్తాయని తెలిపారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగులపై తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు మితిమీరి పోయాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతూ, పనిచేయనియడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక నుంచి ఇప్పటికే బీజేపీని ప్రజలు తరిమికొట్టారని.. రాబోయే ఎన్నికలలో దేశం నుంచి కాషాయ పార్టీని ప్రజలు వెళ్లగొట్టడం ఖాయమని అన్నారు. బిజెపికి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.