ప్రభుత్వం ఖమ్మం సభను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు తిరగబడతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఖమ్మం నుండి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసి గెలుస్తానని తెలిపారు. సింగర్ సాయి చంద్, ఎమ్మెల్యే సాయన్న లకు అవమానం జరిగిందని.. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలకు కూడా దళితులు అర్హులు కాదా..? అని ప్రశ్నించారు.
బిజెపి పాలనలో రాజ్ భవన్ లు రాజకీయ భవన్లుగా మారాయని ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సర్కార్ పాలనకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ కీలక బిల్లులను పెండింగ్లో పెట్టారని.. తమిళనాడులో గవర్నర్ రవి ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఆదరణ చూసి తట్టుకోలేక బిజెపి రాజకీయ కుట్రలు చేస్తుందన్నారు.