జులై 1వ తేదీన వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే మూడు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని వెల్లడించారు.
వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందని ప్రధాని మోదీ అన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని.. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని పేర్కొన్నారు. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్యనాయుడు పోరాడారన్న ప్రధాని మోదీ.. ఎమర్జెన్సీ సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖలో తనదైన ముద్రవేసిన వెంకయ్య స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని తెలిపారు. వెంకయ్యనాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని మోదీ కొనియాడారు.