రాష్ట్రంలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసును తొక్కిపెడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కుంభకోణాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎక్కడున్నా.. ఆ పార్టీ రాజకీయాల్లో ఐదు ముద్రలు కనిపిస్తాయిని అన్నారు. అవి 1. తప్పుడు మాటలు, తప్పుడు హామీలు. 2. ఓటుబ్యాంకు రాజకీయాలు. 3. మాఫియా, నేరస్థులను పెంచి పోషించడం. 4. కుటుంబ రాజకీయం, 5. అవినీతి. ఈ ఐదు ముద్రలు కాంగ్రెస్ పంజాగా మారుతాయని మోదీ వ్యాఖ్యానించారు.
“ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కూడా.. కాంగ్రెస్ పార్టీ పంజా వాడిని గమనిస్తున్నారు. ఈ డబుల్ ఆర్ పన్నును నియంత్రించకపోతే.. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ కోలుకోలేనంతగా నష్టపోతుంది. గతంలో భారాస తెలంగాణను నాశనం చేసింది. ఇప్పుడు డబుల్ ఆర్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఈ పార్టీకి కళ్లెం వేయాలంటే.. భాజపా అభ్యర్థులందరినీ గెలిపించండి. ఆ పార్టీ భయపడుతుంది. నియంత్రణలో ఉంటుంది.” అని మోదీ అన్నారు.