వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మోదీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు.అనంతరం అందులో కొందరు విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. అంతకుముందు ప్రధాని వారితో ముచ్చటిస్తారు.
తర్వాత ఆయన 12.15 నిమిషాలకు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. ఈ వేదికపై నుంచే పలు జాతీయ రహదారుల పనులకు, బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే పూర్తయిన సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. 12.50 నుంచి 1.20 వరకు సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.