రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు ముఖాముఖీ భేటీ అవుదామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. చంద్రబాబు లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ నెల 6వ తేదీన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల హోదాలో తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడాన్ని స్వాగతించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుర్చొని చర్చించడం వలన విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖాముఖీ మాట్లాడుకుంటే పదేళ్ల సమస్యలు సాల్వ్ అవుతాయన్నారు. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కూర్చొని కలిసి భోజనం చేశారు కానీ రాష్ట్ర విభజన అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించలేదని సెటైర్ వేశారు.