ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లాడని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవమే, కానీ నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నిజంగా నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు కోమటిరెడ్డి రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధం.. ప్రూవ్ చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, నా పాస్పోర్టీతో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తా. కోమటిరెడ్డి దగ్గర ఉన్న ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి చెప్పిన తేదీన, టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు పాస్పోర్టులో ఇమ్మిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని.. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఈ ఆరోపణ ఒక ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీల్లో బ్రేకింగ్, స్క్రోలింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలని సూచించారు.