తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి తుదిపరీక్షలు ఆదివారం రోజున ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 12న ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ఎస్సై స్థాయి తుది రాత పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. చివరగా ఆదివారం కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతలు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగం పరీక్షలతో ఈ ప్రక్రియ పూర్తయింది. పరీక్షల ప్రాథమిక కీని త్వరలోనే విడుదల చేస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణలో సంచలన విజయం సాధించిన బలగం సినిమాపై ఆదివారం జరిగిన కానిస్టేబుల్ తుది పరీక్షలో ఓ ప్రశ్న అడిగారు. మార్చి 2023 ఒనికో ఫిలిమ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్న ఇచ్చి.. సమాధానాలుగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ సంభాషణ ఆప్షన్లు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 183 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించిన శాంతిభద్రతల విభాగం పరీక్షలకు.. 1,09,663 మంది అభ్యర్థులకు గానూ 1,08,055 మంది (98.53 శాతం) హాజరయ్యారు. హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లోని 8 కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30కు నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్ పరీక్షలకు 6,801 మందికిగానూ 6,088 (89.52 శాతం) మంది హాజరయ్యారు. రెండు విభాగాల్లో కలిపి 98.01 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.