తెలంగాణ మంత్రి హరీశ్ రావు దుబ్బాకకు రావాల్సిన నిధులను అడ్డుకున్న ప్రగతి నిరోధకుడు అని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రఘునందన్ రావు మాట్లాడారు. ఎమ్మెల్యే నిధులు వస్తే.. రఘునందన్ రావుకు పేరు వస్తుందని అడ్డుకున్నారు. దుబ్బాక అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇప్పుడు ఎన్నికల్లో వచ్చి కళ్లిబొల్లి మాటలు చెప్పి ఓట్లు కొళ్లగొట్టడానికి వస్తున్నారని మండిపడ్డారు. 24 గంటలు వైద్ం అందేలా డాక్టర్లను నియమించలేని మంత్రివి.. పేద ప్రజల కోసం మండలానికి ఒక అంబులెన్స్ ఇవ్వలేని మంత్రివి.. రఘునందన్ రావు ఏం చేశాడని ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు పార్టీలతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.5కోట్ల నిదులను ఇస్తుందని.. ఎనిమిదేళ్ల నుంచి రూ.40 కోట్ల రూపాయలు కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు. కుల సంఘ భవనాల పేరుతో కులాల మధ్య వైరం పెంచి ఓట్లు వేయించుకోవాలని కుట్ర పన్నుతున్నారని.. దుబ్బాక ప్రజలు మీ కుట్రలను తిప్పి కొడతారని హెచ్చరించారు. హరీశ్ రావుకి నీతి, నిజాయతీ ఉంటే ఆయన ఆస్తులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాయపోల్ మండలంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ కార్యాలయాలను ఎందుకు నిర్మించలేదని.. ఆర్థిక మంత్రివి నువ్వే కదా అని ప్రశ్నించారు.