తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాల్గొనాల్సి ఉంది. ఛాపర్‌లో లోపం తలెత్తడంతో రోడ్డు మార్గంలో రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వెళ్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు మూడు సభలలో పాల్గొనవలసి ఉంది. రోడ్డు మార్గంలో రావడంతో సభలకు ఆయన ఆలస్యంగా వచ్చే అవకాశముంది. ఆయన తన సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అంతకుముందుకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలది. నేనీ స్థాయికి చేరడంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఉంది. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్.. ఈ సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే. చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందే. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్.’ అని వ్యాఖ్యానించారు.