నల్గొండ జిల్లా ఆ రెండు తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ సెన్సిటివ్ జిల్లా అని.. వామపక్ష జిల్లా అని, వామపక్ష తీవ్రవాదం, ISI తీవ్రవాదం అన్నింటికీ అడ్డాగా నల్గొండ ఉపయోగపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎదుగుదలకు ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు అడ్డుపడుతుంటే.. బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలకు తెగించి ఇక్కడ పార్టీని నడిపిస్తున్నారని తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తరువాత దేశం ఎక్కడికి పోతుందో సమాజం ఆలోచించాలన్నారు. రకరకాల జీహాద్ ల పేరుతో వచ్చి.. ఇవాళ మదర్సాల పేరుతో జీహాద్ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్కూళ్లు, కాలేజీలను తనిఖీ చేసినట్టే మదర్సాలను కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. మదర్సాలలో ఎవరుంటున్నారు.. వారికి నేర్పిస్తున్నటువంటి కోర్సులు ఏంటివి అనేవి విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మదర్సాల గురించి కాస్త ఆలోచించాలన్నారు.