తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని.. ఈ విషయంలో తెలంగాణ దేశానికి ఒక మార్గం చూపించిందని ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని.. కానీ రాష్ట్ర సంపద మాత్రం కార్పొరేట్ వర్గాల దగ్గరనే ఉందని ఆరోపించారు. గుజరాత్ అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 గంటలకు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడే నరేంద్ర మోడీ ఆ వర్గాలకు మాత్రం మేలు చేయరని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ ను బీజేపీ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. కులగణనతోనే దేశంలో ఓబీసీలు, దళితులు, మైనార్టీల సంఖ్య తేలుతుందని.. కానీ దీనికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్ల పై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ఒక్కొక్కటిగా అదానీ, అంబానీకి విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు.