రాష్ట్రంలో బుధవారం పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం రోజున ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో 6.2 సెంటీమీటర్లు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.1, పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 5.2, జయశంకర్ జిల్లా చిట్యాలలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.