తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రధానంగా కరీంనగర్ లో ఉన్నట్టుండి వాతావరణం అంత ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ జరగాల్సి ఉండగా.. అక్కడ వీచిన గాలికి టెంట్లు అన్ని కుప్ప కూలీపోయాయి. కుర్చీలు ఎక్కడికక్కడ చెల్లచెదురుగా పడిపోయాయి. కరీంనగర్ లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
ఈ భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి సభకు అంతరాయం ఏర్పడింది. వర్షం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. ఇక హైదరాబాద్ లో సైతం వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్ ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. మియాపూర్ లో వడగండ్ల వాన కురిసింది. మరో 3 గంటలు పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు అటు ఏపీలోని విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి వంటి జిల్లాలలో వర్షం జోరుగా కురుస్తోంది.