హైదరాబాద్ అభివృద్ధిని చూసి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఆశ్చర్యపోయారని తెలిపారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నేడు బేగంపేటలోని ధనియాల గుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంగళవారం ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాన్ని చూస్తుంటే ఇది మన దేశంలో ఉందా..? లేక న్యూయార్క్ నగరమా..? అనే స్థాయిలో హైదరాబాద్ మారిపోయిందని రజనీకాంత్ అన్నారని గుర్తు చేశారు.
సినిమా యాక్టర్ లయ సైతం హైదరాబాద్ లో ఉంటే.. లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారని కేటీఆర్ ఉటంకించారు. ఇదంతా బిఆర్ఎస్ కృషివల్లే సాధ్యమైంది అన్నారు కేటీఆర్. 9 ఏళ్ల తమ పాలనలో హైదరాబాద్ మనమంతా గర్వపడేలా తయారైందా లేదా అనేది ఆలోచించాలని కోరారు. అయితే అమెరికా వంటి నగరాలలో సమస్యలు ఉండవని అనుకోవడం బ్రమ అని.. అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ లోనూ సమస్యలు ఉన్నాయని.. వాటిని అధిగమిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని చెప్పారు.