తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రమని ఆర్.బి.ఐ రిపోర్టు తేల్చిచెప్పింది. కానీ, అబద్దాల పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నది అని brs నాయకులూ అంటున్నారు. నిజాన్ని అబద్దంగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిజం నిప్పు లాంటిది. కొంత ఆలస్యంగా అయినా బయటకు వస్తుంది. అందరి కళ్ళు తెరిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికతో పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై, ఆర్థిక వృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది దుష్ప్రచారమేనని తేలిపోయింది. తెలంగాణ దివాలా అంటున్న వారికి ఆర్బీఐ రిపోర్టు చెంపపెట్టు లాంటిది అని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సంపదను సృష్టించడం, దాన్ని రెట్టింపు చేయడమెలాగో దేశానికే చెప్పింది తెలంగాణ. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్తున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ,తలసరి ఆదాయం, విద్యుత్తు, సాగు విస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నింటా తెలంగాణ రికార్డు సృష్టించి అభివృద్ధికి అర్థమేంటో చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్ప అని రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చారు. ఏడు లక్షల కోట్ల అప్పు అని దుష్ప్రచారం చేశారు. కానీ, ఆర్.బి.ఐ రిపోర్టుతో అవన్నీ పటాపంచలయ్యాయి అని BRS పేర్కొంది.