సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకీకృత పెన్షన్ ను తిరస్కరించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం టీజేఏసీ బృందం వినతి పత్రం అందజేసింది. అనంతరం జేఏసీ అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చందా లేకుండానే పదవీ విరమణ తరువాత సర్వీస్ ని బట్టి పెన్షన్, గ్రాట్యూటీ, కమ్యూటేషన్ ఉండేదన్నారు.
ఉద్యోగంలో ఉండి చనిపోయినా లేదా పదవీ విరమణ తరువాత చనిపోయినా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల తరువాత వచ్చే అదనపు పెన్షన్, ఉద్యోగం ఉన్నప్పుడు పదవీ విరమణ తరువాత కూడా హెల్త్ కార్డు సదుపాయం, వేతన సవరణ, కరువు భత్యం అవకాశముంటుందన్నారు. ఉద్యోగంలో మరణించిన, తొందరగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ 9600 ఉంది. అదేవిధంగా కారుణ్య నియామకం కూడా అవకాశం ఉందన్నారు.