2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా లాస్య నందిత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇటీవలే లాస్య నందిత తిరిగిరాని లోకానికి వెళ్లింది. దీంతో ఆ స్థానానికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ని ప్రకటించింది. మే 13న పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది.
లాస్య నందిత మరణించిన సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయన్న కూతురు లాస్య నందిత అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆ సమయంలో సాయన్న కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదు అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో ఇప్పుడు కంటోన్మెంట్ ఏకగ్రీవంగా జరిగేవిధంగా కనిపించడం లేదు. తాజాగా లాస్య నందిత చెల్లి నివేదితను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుందా..? లేక ఏకగ్రీవం అవుతుందా అనేది కొద్ది రోజుల్లోనే తెలియనుంది.