టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. నేడు నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శించారు. 50 ఏళ్లలో దేశానికి ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు నేడు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం డబ్బులు పంచుతూ దొరికిన క్రిమినల్ అని.. దొరికిన క్రిమినల్ రేవంత్ ను దిక్కు లేక కాంగ్రెస్ ప్రెసిడెంట్ ను చేశారని అన్నారు. మూడు గంటలు కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ కావాలా..? 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా..? మతం మంటల బిజెపి కావాలా..? అని అడిగారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే వారినే గెలిపించాలని కోరారు. మణిపూర్, హర్యానాలో మతం పేరుతో మంటలు రేపి ఓట్లు పొందే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మపురి అరవింద్ అడ్డిమార్ గుడ్డి దెబ్బగా ఎంపీ అయ్యారని విమర్శించారు. బిజెపి కి నిజామాబాద్ లో అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.