ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆర్థిక స్వావలంబనకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కల్పనకుగాను ఒక్కొక్కరికీ కనిష్ఠంగా రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని వాయిదా రూపంలో వారు తిరిగి చెల్లించాలి.
ఉన్నతి….డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ పథకం ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యం. ఇప్పుడు రుణ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊతం లభించనుంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి ఈ పథకానికి మరో రూ.250 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతమున్న రూ.250 కోట్ల నిధులకు ఇవి అదనంగా చేరితే రూ.500 కోట్ల మేర రుణాలను ఒక్క ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీలకు అందించే అవకాశం ఉంటుంది.