ముందస్తు అరెస్టుల విషయంలో తెలంగాణ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నిర్బంధ చట్టాన్ని అనుకున్నదే తడవుగా అమలు చేస్తూ.. వెంటనే అరెస్టులకు దిగుతున్న తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కొందరు పోలీసు అధికారులు హరిస్తున్నారని ఫైర్ అయింది.
నిర్బంధంలో ఉన్న ఓ మహిళ భర్తను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడానికి పోలీసులు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. చట్టంలోని కఠిన నిబంధనలను ఆదరాబాదరాగా అమలు చేయకూడదనే విషయాన్ని తెలంగాణలోని ఉన్నతాధికారులకు గుర్తు చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు పౌరుల హక్కులను రక్షించాలనే బాధ్యత ఉందనే విషయమూ గుర్తుండాలి కదా అని అన్నది. కానీ రాజ్యాంగం పౌరులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను మరిచిపోయి వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పోలీసులు నియంత్రణలను విధిస్తున్నారని మండిపడింది. దీనికి చరమగీతం పాడాలని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.