కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త్వరలో హైదరాబాద్లో పర్యటించనున్నారు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ రానున్న సోనియా.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులు కూడా రానున్నట్లు సమాచారం. జూన్ 1న లేదా మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉండనున్నట్లు తెలిసింది.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ బోయిన్‌పల్లి శివారులో సుమారు పదెకరాల స్థలం కేటాయించారు. అందులో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు గతంలో దరఖాస్తు చేశారు. బుధవారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి సమావేశంలో జీ ప్లస్ 2 భవనానికి అనుమతి ఇస్తున్నట్లు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ప్రకటించారు. అనుమతి లభించిన నేపథ్యంలో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ భావిస్తోంది.