న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నామని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోనే బలమైన పునాదులు వేశారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలి. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలి. దీంతో మిగతా వారెవ్వరూ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడరు అని కేటీఆర్ పేర్కొన్నారు.