శాసనసభ పాస్ చేసిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పి.శ్రీనరసింహ, జస్టిస్ జె.బి.పర్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడానికి ఉపక్రమించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ అవసరం లేదని, తాను విషయాన్ని తెలుసుకొని చెబుతానని సీజేఐకి విన్నవించారు. తాను ఇక్కడే ఉన్నందున ప్రత్యేకంగా కేంద్రానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే మంగళవారం వెలువడిన ధర్మాసనం లిఖితపూర్వక ఉత్తర్వుల్లో కేంద్రానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.
మరోవైపు గవర్నర్ తన వద్ద ఉన్న బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని.. దీనివల్ల ఎంతో మంది యువత భవిష్యత్ అంధకారమవుతోందని బీఆర్ఎస్ మహిళా మంత్రులు మండిపడ్డారు.