తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన.. ముఖ్యంగా హైదరాబాద్ వాసుల ఇలవేల్పు.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి రంగం సిద్ధం అయింది. ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రధానంగా కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ బల్కంపేట ఆలయాన్ని సందర్శించిన తలసాని.. అమ్మవారికి మొక్కులు చెల్లించి.. కల్యాణ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించారు.
ప్రతి సంవత్సరం లాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ ఘనంగా నిర్వహిస్తామని తలసాని వెల్లడించారు. గత ఏడాది ఉత్సవాలకి 8లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ ఏడాది దాదాపుగా 15లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే కళ్యాణం.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.