టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ ఆవిర్భావ సభ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 20వేల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. ముందుగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్‌లో స్వర్గీయ ఎన్టీరామా రావుకు నివాళులు అర్పిస్తారు. అనంతరం సభకు బయల్దేరతారు.
టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్ధాలుగా టీడీపీ వెంటే ఉంటూ.. అండగా నిలుస్తున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా. బడుగు బలహీనవర్గాలకు భరోసా అయ్యింది. ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం. సకలరంగాల అభివృద్ధిపైనా టీడీపీ సంతకం చెరగనిది.’ అని నారా లోకేశ్ అన్నారు.