నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ఇవాళ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు నామినేషన్లను ఆన్ లైన్ లోనూ సమర్పించవచ్చు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినప్పటికీ అభ్యర్థి దాని ప్రతిపై సంతకం చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి విధిగా అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కణ్నుంచే నామినేషన్ దాఖలు చేసినట్లైతే అక్కడి రాయబారి కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ విధిగా నింపాలని… ఖాళీకి ఆస్కారం లేదని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. A ఫారం, B ఫారాలను నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మూడు గంటల్లోపు ఇవ్వాలి. అభ్యర్థులు నిర్ధేశిత దరావత్తు అయిన పదివేల రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5000 డిపాజిట్ చెల్లించాలి.

నామినేషన్ వేసే అభ్యర్థులు పాటించాల్సిన మరికొన్ని సూచనలు..

  • నామినేషన్ల దాఖలు సమయంలో ఆర్‌వో కార్యాలయాల వద్ద ఆంక్షలు
  • ఆర్వో కార్యాలయం 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకే అనుమతి
  • రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే అనుమతి
  • సువిధ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ నామినేషన్లకు కూడా అవకాశం
  • అభ్యర్థి నామినేషన్‌తో పాటు అన్ని వివరాలు తెలిపే అఫిడవిట్‌ తప్పనిసరి
  • విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలతో అఫిడవిట్ తప్పనిసరి
  • ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తప్పనిసరి
  • ఆన్‌లైన్ నామినేషన్‌ వేస్తే ప్రింటెడ్ కాపీ ఆర్వోకు ఇవ్వడం తప్పనిసరి
  • నామినేషన్, అఫిడవిట్ ప్రతులను నోటీసుబోర్డులో పొందుపర్చనున్న ఆర్వో

Read more RELATED
Recommended to you

Latest news