తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రకటించిన జాబితాలో టికెట్ రాని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అలా రాష్ట్రంలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పార్టీలు మారుతున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి టీడీపీ సైడ్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఇక ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు కాసాని జ్ఞానేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో అనుచరులతోనే ఆయన ఎర్రవల్లికి వెళ్లనున్నట్లు సమాచారం.