త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మరో ఆరుగురు కొత్త మంత్రులకు ఇందులో అవకాశం కలగనుంది. ఏఐసీసీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. కీలకమైన హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్, కార్మిక శాఖలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అధిష్ఠానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులను విస్తరణలో భర్తీ చేయాల్సి ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మాత్రం చాలా మంది ఉన్నారు. 6 మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీకి, మరొకటి మైనారిటీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కీలకమైన హోం శాఖను బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.