రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఇటు ప్రభుత్వ విధులు.. అటు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పని నిమిత్తం దిల్లీ, హైదరాబాద్లను తరచూ చుట్టేస్తున్నారు. బుధవారం ఉదయమే దిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సీఎం ఇవాళ మళ్లీ హస్తినకు పయనం కానున్నారు.
ఈ బిజీ షెడ్యూల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశం వాయిదా పడింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్షలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీఎం భావించారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై జిల్లా పాలనాధికారులు అందరూ తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. వారంతా ఆ మేరకు సిద్ధమయ్యారు కూడా.
అయితే తాజాగా ఈ సమావేశం వాయిదా పడినట్లు వారికి సమాచారం అందింది. ఓవైపు శాసనసభ సమావేశాలు కొనసాగుతుండడం, మరోవైపు ఇవాళ దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానుండడం వల్ల ఈ సమీక్షా సమావేశానికి సీఎం హాజరు కాకపోవచ్చని, ఈ మేరకు సమావేశం వాయిదా వేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.