లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు పూర్తి స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఏఐసీసీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన 13 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లు ఆశిస్తున్న నాయకులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. సామాజిక సమతుల్యత పాటిస్తూనే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళ్తోంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని భావిస్తున్న రాష్ట్ర నాయకత్వం, పార్టీ సిద్ధాంతం నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను కూడా బరిలోకి దింపే యోచన చేస్తోంది. రేపు ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.