కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్…. రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకుల నిర్భంధం

-

తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు చేపట్టిన నిరసన దీక్షలకు, ఆందోళనలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. పీసీసీ అధ్యక్షు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో… దీనిపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలను నిర్భందిస్తున్నారు పోలీసులు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వరకు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు పోలీసులు.

రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఇంటిచుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.  ఇంధన ధరలతో పాటు, విద్యుత్ ఛార్జీలు తగ్గించడం, ధాన్యం కొనుగోలు చేసే దాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి నిన్న ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, షబ్బీర్‌ అలీ, దాసోజు శ్రవణ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరొవైపు జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news