తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ, రేపు ఇంజినీరింగ్ రెండోవిడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. రెండోవిడతలో 29,777 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో కన్వీనర్ కోటా సీట్లు: 78,694 ఉండగా.. 75,200 సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 55,941 సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా.. 22,753 మిగిలిపోయాయి. రెండోవిడతకు 7,024 అదనపు సీట్లు మంజూరయ్యాయి.
మరోవైపు ఇంకో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలపడంతో వాటిల్లో 70 శాతం కన్వీనర్ కోటా కింద 7,024 సీట్లను రెండోవిడత కౌన్సెలింగ్‌లో చేర్చారు. మొదటివిడతలో మిగిలిపోయిన 22,753 కలిపి మొత్తం 29,777 సీట్లు రెండోవిడతలో అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన సీట్లు, కళాశాలల కోసం తొలి విడతలో సీట్లు పొందిన వారు సైతం పోటీ పడొచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.