తెలంగాణలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండు లేదు మూడు రోజుల్లోనే వీటి విక్రయాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. గతంలో వీటిని టవర్ యూనిట్ గా టెండర్లు వేశారు. కానీ కొనేందుకు రియల్ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఒక్కొక్కటిగా అమ్ముతున్నారు.
మొత్తం 8034 ఇండ్లు ఉండగా.. వీటి అమ్మకం ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలను బట్టి ధరలను నిర్ణయించారు. దీనిపై వేసిన అధికారుల కమిటీ ధరలను ఖరారు చేసింది.
పూర్తిగా నిర్మించిన ఇళ్లకు చదరపు అడుగుకు రూ.3300 గా నిర్ణయించారు. నిర్మాణం తుది దశలోని ఇళ్లకు రూ.3 వేలు అంతకు తక్కువగా నిర్మాణాల్లో ఆగిన ఇళ్లకు చదరపు అడుగుకు కనీస ధర రూ.2700 గా ఫైనల్ చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే క్లారిటీ రానుంది.