తెలంగాణలో వైన్ షాప్స్ @ 7am టు 1pm ఓన్లీ!

-

లాక్ డౌన్ కారణంగా మద్యం ముట్టక అల్లల్లాడిపోతున్న గ్లాస్ మెట్స్ కు శుభవార్త చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం! ఇంతకూ ఆ శుభవార్త ఏమిటంటారా… త్వరలోనే వైన్ షాపులు తెరిచేందుకు లైన్ క్లియర్ చేయడమే! ఈ మేరకు పరిమిత సంఖ్యలో వైన్ షాపులు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్న సర్కార్.. ఏయే ప్రాంతాల్లో ఏ షాపులకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కసరత్తు ప్రారంభించింది. అవును… అంతా అనుకూలంగా జరిగితే మరో 2 లేక 3 రోజుల్లో గ్లాస్ మెట్స్ కు ఈ శుభవార్త చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం!

వివరాళ్లోకి వెళ్తే… మరో 2 రోజుల్లో కొన్ని ఆంక్షలతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉందని భావించారు. కాని మరో రెండు వారాలను పెంచింది కేంద్రం. తెలంగాణలో 7వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు కూడా ఈ ఒక్క విషయానికి సడలించి 7వ తేదీకంటే ముందే వైన్ షాపులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. తాజాగా కేంద్రం గ్రీన్ ఆరెంజ్ జోన్లకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.  తెలంగాణలో ఇప్పటికే సుమారు 9 జిల్లాలను గ్రీన్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రం. నాగర్ కర్నూల్, సిద్ధిపేట్, మహబూబ్ నగర్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, వరంగల్ రూరల్, భువనగరి జిల్లాల్ని కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించింది. అంటే… ఈ జిల్లాల్లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నమాట.

కాకపోతే… రెగ్యులర్ రోజుల్లా అంతేసి సమయం కాకుండా… ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఈ వైన్ షాపులు తెరవాల్సి ఉంటుందట. అనంతరం మూసెయ్యాల్సిందే. ఈ కండిషన్ మీద పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే… ఖచ్చితంగా ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై మాత్రం సర్కార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే… ఈ విషయంపై మరికొంతమంది మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ జోన్ లో వైన్ షాపులకు అనుమతి ఇస్తే.. ఆరెంజ్, రెడ్ జోన్ల నుంచి కూడా మందు బాబులు గ్రీన్ జోన్ లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని, వారిని ఆపడం ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతుందని… ఇంకా గట్టిగా చెప్పాలంటే అసాధ్యం కూడా అని అభిప్రాయపడుతున్నారంట. అప్పుడు వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారంట. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news