ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసుపై తెలంగాణ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీసం ఆరేళ్లు ఉండాలంటూ జారీ అయిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒకటో తరగతిలో చేరాలంటే కనీస వయస్సు 6 ఏళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పి.పరీక్షిత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్, జె అనిల్‌కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్యావ్యవస్థ పటిష్ఠతకు పునాది దశ కీలకమైనదని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ప్రకటిస్తూ.. 3 నుంచి 8 ఏళ్ల వయస్సులో మూడేళ్ల ప్రీస్కూల్, రెండేళ్ల ప్రైమరీ గ్రేడ్ తరగతులుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ. కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయస్సు 6 ఏళ్లుగా ఉండాలని నిర్దేశింది. రెండేళ్లపాటు ప్రీస్కూల్ విద్య భోధనకు డిప్లమో ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును రూపొందించడానికి అవకాశాలు ప్రయత్నించాలని సలహా ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.