ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపుల కేసుపై హైకోర్టు కీలక ఆదేశం

-

రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం హైకోర్టుకు కూడా చేరింది. అయితే తాజాగా ఈ వ్యవహారానికి తెలంగాణ హైకోర్టు ది ఎండ్ పలికింది. 10 మంది ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు అనుకూలంగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ.. కేటాయింపుల వివాదంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలను పాటిస్తూ అధికారుల ప్రస్తుత, మిగిలిన సర్వీసుతో పాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా 14 పిటిషన్లపై జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేటాయింపులపై అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్రానికి వినతి పత్రాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news