ఫోన్ ట్యాపింగ్ , ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీసు కస్టడీకి ఇవ్వడంపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్‌రావు మంగళవారం రోజున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ జి.రాధారాణి పోలీసుల వివరణ కోరుతూ విచారణను ఈరోజుకు వాయిదా వేశారు. వాస్తవాంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసు కస్టడీకి ఆదేశాలు జారీ చేసిందని ప్రణీత్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కస్టడీకి అప్పగించేముందు నిర్దిష్ట షరతులు విధించలేదని, పోలీసు స్టేషన్‌లో పడుకోవడానికి సరైన సౌకర్యంలేదని ప్రణీత్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు దర్యాప్తులోని కొన్ని అంశాలను మీడియాకు కావాలనే లీకులు ఇస్తున్నారని. తన ప్రతిష్ఠపై బురద జల్లడానికే ఇలా చేస్తున్నారని వాపోయారు. ఇంటరాగేషన్ సమయంలో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదని, ఇప్పటికే సమాచారం వెల్లడించినందున కస్టడీని రద్దు చేయాలని పిటిషన్లో ప్రణీత్ రావు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.