ఈనెల 22న ఈడీ ముందు హాజరుకావాలని ఎంబీఎస్ అధినేత సుఖేష్‌గుప్తాకు హైకోర్టు ఆదేశాలు జారీచే సింది. ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోలు వ్యవహారంలో ఈడీ నమోదుచేసిన కేసుపై హైకోర్టు ఈ విధంగా ఆదేశాలిచ్చింది. ఈడీ దర్యాప్తును నిలిపివేస్తూ గత నెల 20న మధ్యంతర ఉత్తర్వులకు నోటీసులను మాత్రమే అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఫారెక్స్‌లో హెచ్చుతగ్గుల సమయంలో ఒప్పందం ప్రకారం అదనపు సొమ్ము చెల్లించకపోవడం ద్వారా ఎంఎంటీసీకి రూ.220 కోట్ల నష్టానికి కారణమైన ఎంబీఎస్ జ్యువెలర్స్‌తోపాటు యజమాని సుఖేష్‌గుప్తాపై 2013లో సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సుఖేష్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు.
ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎఆర్‌ఎల్ సుందరేశన్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ముందుకెళ్లలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మొత్తం కుటుంబసభ్యులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తారా? అంటూ మండిపడగా.. కేవలం సుఖేష్‌గుప్తాను విచారించడానికి అనుమతించాలని సుందరేశన్ కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి స్టేకు ముందు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకావాలని సుఖేష్‌గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. అవగాహన ఒప్పందం అమలు వ్యవహారంపై విచారణ చేపడతామంటూ మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.