తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16 తేదీలలో సాహిత్య సభలు నిర్వహించనున్నామని సంస్థ అధ్యక్షురాలు, తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రజాకవి కాళోజీ సాహిత్య సేవలను స్మరించుకునేందుకు ఈ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ధిక్కార తత్వానికి ప్రతీక కాళోజీ అని కొనియాడారు.
కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఆయనకు కవిత నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కార గ్రహీత శ్రీరామోజు హరగోపాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ, సాహిత్య అకాడమీ, అధికార భాషాసంఘం, టీఎస్‌ఫుడ్స్‌ల ఛైర్మన్లు అయాచితం శ్రీధర్, జూలూరు గౌరీశంకర్, మంత్రి శ్రీదేవి, మేడె రాజీవ్‌సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు. భూపాలపల్లి సింగరేణి గనిలో ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గాయపడ్డ వారిని ఆమె పరామర్శించారు.