జూన్ 11 నుంచి భూముల డిజిటల్ సర్వే

-

తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. పైలట్ డిజిటల్ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు. అందులో సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి 3 గ్రామాలు ఉండాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

కాగా డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నదని వివరించారు.

రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వ్యాపారం కోణంలోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించాలని అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు.

గ్రామాల్లో తగాదాలు లేని విధంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తి స్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు.

ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించి నిర్లక్యం చేసి తప్పులకు తావిచ్చినా, చట్ట పరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సీఎం సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news