సిద్దిపేట కీర్తి దేశ న‌లుమూల‌ల‌కు చేరాలే !

-

– ఫిబ్ర‌వ‌రి 1న పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఆన్‌లైన్ క్లాసులు కొన‌సాగించాలి
– కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని తమ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో విఫలం
– తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

హైద‌రాబాద్ః అభివృద్ధిలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా ముండుకు సాగుతూ సిద్ధిపేట కీర్తి దేశంలోని న‌లుమూల‌ల‌కు వ్యాపించేలా చేద్దామ‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సిద్ధిపేట కీర్తి కూడా ప‌తంగుల మాదిరి ఆకాశ‌వీధులను తాకాల‌నీ.. యావ‌త్ దేశం అది చూడాల‌ని అన్నారు. గురువారం సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో స్వ‌చ్ఛ‌ స‌ర్వేక్ష‌న్‌లో భాగంగా కైట్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు కైట్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతున్న‌ద‌నీ, సిద్ధిపేట కూడా ఆ మ‌హా న‌గ‌రాల స‌ర‌స‌న చేరుతూ.. వాటికి ధీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న‌ద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఈ ప‌తంగుల ఉత్స‌వంలో బెంగుళూరు, వ‌డోద‌ర‌, హైద‌రాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల‌కు చెందిన వ్య‌క్తులు ఈ కార్య‌క్ర‌మంలో భాగం కావాడానికి వ‌చ్చార‌ని తెలిపారు. కేంద్రం ప్ర‌భుత్వం చెత్త‌ర‌హిత‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ఉండే ప‌ట్ట‌ణాల‌కు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డులు ఇస్తుంద‌నీ, ఈ సంవ‌త్స‌రం సిద్ధిపేట‌కు మొద‌టి బ‌హుమ‌తి రావాల‌నీ, దానికి అనుగుణంగా మ‌నంద‌రం కృషి చేయాల‌ని కోరారు. ప్ర‌జ‌ల్లో ఐక్య‌త‌ను పెంపొందించ‌డానికి నేడు ప‌తంగుల ఉత్స‌వాన్ని నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైనా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు కొన‌సాగించాల‌ని హ‌రీష్ రావు సూచించారు. తాజాగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ లైన్ టీచింగ్ పోటీని నిర్వహించింది. మంచి పనితీరు కనబరిచిన ఉపాధ్యాయులను హరీశ్ రావు అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పోటీ మంచి చొరవ అనీ, ఇది అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు

ఇది టీచర్లను ప్రోత్సహించడమే కాకుండా, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే సృజనాత్మక స్ఫూర్తిని నింపుతుంద‌ని తెలిపారు. క‌రోనా మహమ్మారి సమయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చి, విద్యార్థుల్లో మంచి విలువలను పెంపొందించుకోవాలని హితవు పలికారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని తమ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యాయని హ‌రీష్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news