కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడమంటే చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆన్‌లైన్లో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ఏడాది టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చేనేత మిత్ర ద్వారా 50శాతం సబ్సిడీ ద్వారా ముడి సరకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
నేతన్న బీమా ద్వారా 8వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు మరణిస్తే పది రోజుల్లో రూ.5 లక్షల బీమా నామినీకి అందిస్తామన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేత కార్మికులకు మరిన్ని అవకాశాలు, లబ్ధి చేకూరుతుందన్నారు.