తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ అహ్వానాలు పంపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఏఐసీసీ నేతలకు రేవంత్ రెడ్డి దిల్లీలో స్వయంగా కలిసి ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆరాష్ట్ర మంత్రులతోపాటు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, ఛతీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ లకు ఆహ్వానాలు పంపుతున్నారు.
గతంలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మోహిలి, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలతోపాటు ఉద్యమ నేతలు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమకారులు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ తోపాటు వివిధ కులసంఘాల నేతలకు మేధావులకు ఆహ్వానాలు పంపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.