తెలంగాణ సరిహద్దులు కట్టుదిట్టం…. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం అయ్యాయి. జూన్ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా … రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్దతు ధర రూ. 1960లో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. ఈ సీజన్ లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో పాటు… తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో అక్కడి ధాన్యాన్ని తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ సరిహద్దుల చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతోంది. తెలంగాణతో మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, చత్తీస్ గడ్ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. గతంలో కూడా చత్తీస్గడ్, ఏపీ నుంచి తెలంగాణకు ధాన్యం తీసుకువచ్చి అమ్ముకున్నారు. ఇక్కడి రైతులకు ఇబ్బందులు రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.