తెలంగాణపై సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు విజృంభిస్తూ రాష్ట్ర ప్రజలకు ఉక్కపోతతో ఊపిరిసలపకుండా చేస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ దాని చుట్టపక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వాతావరం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో .. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కుముంభీం, ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.