వేర్వేరు ప్రాంతాలను, సంస్కృతులను పరస్పరం తెలుసుకునేందుకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో కేంద్ర సర్కార్ రూపొందించిన కార్యక్రమం కింద జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్ నుంచి నజకత్ చౌధరి అనే వ్యక్తి అసోంకు వెళ్లారు. ఈ పర్యటనలో తన అనుభవాన్ని వివరిస్తూ నజకత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ పర్యటనను జీవితాంతం మరిచిపోలేనని లేఖలో పేర్కొన్నారు. దానికి మోదీ బదులిచ్చారు.
భిన్నత్వం పట్ల ప్రజల్లో సహజంగా, స్వాభావికంగా ఉన్న ప్రేమే మన దేశానికి నిజమైన బలమనీ, శతాబ్దాలుగా అది మనల్ని ఐక్యంగా ఉంచుతోందని మోదీ నజకత్కు లేఖ రాశారు. ఈ కోణమే ప్రపంచాన్ని మనవైపు ఆకట్టుకుంటోందని చెప్పారు. ‘మన దేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, జీవనశైలులు, భిన్న ఆహారపు అలవాట్లకు నిలయం. వేర్వేరు సామాజిక వర్గాలు, భిన్న మతాలకు చెందినవాళ్లం వేర్వేరు పద్ధతులు పాటిస్తూ, రకరకాల భాషలు మాట్లాడుతూనే కలసికట్టుగా జీవిస్తున్నాం. ఇతరుల భిన్నమైన జీవన విధానాన్ని పండగగా చేసుకోవడం మరో విశేషం’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు.