ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో జిల్లా అతలాకుతలమైపోతోంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజా పరిస్థితులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీని ఆరా తీస్తున్నారు. వర్షాలు, వరద బీభత్సంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి ఆరా తీస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీరు అందించాలని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎర్రబెల్లి సూచించారు.
మరోవైపు భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఆరెవాగు, తీగలవాగు, మానేరు వాగులకు వరద ఉద్ధృతి సాగుతోంది. మల్లారం వద్ద ఆరెవాగు వంతెనపై వరద నీరు పారుతుడటంతో కొయ్యూరు- తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో ఆకేరు వాగు పొంగిపొర్లుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.